జైపూర్: రాజస్థాన్‌లో మిడతల బెడద ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. రైతులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పురుగుల మందులు పిచికారీ చేసే పంపులతో, ఫైరింజన్‌లతో, ఆఖరికి డ్రోన్‌ల సాయంతో క్రిమి సంహారకాలను చల్లినా మిడతల బెడద తగ్గిందే తప్ప పూర్తిగా తొలగిపోలేదు. బుధవారం రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో మిడతలు కనిపించాయని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది.
రాజస్థాన్‌లోని జైసల్మేర్, బార్మేర్, జోధ్‌పూర్, బికనీర్, చురు, సికార్, నాగౌర్, జైపూర్, పాలీ, హనుమాన్‌గఢ్, శ్రీగంగనగర్, దౌసా జిల్లాల్లో బుధవారం మిడతల ప్రభావం కనిపించిందని అధికారులు చెప్పారు. వాటిలో పూర్తిగా పరిపక్వం చెందని పింకు రంగు మిడతల గుంపులు, ప్రౌఢ పుసుపు రంగు మిడతల గుంపులు ఉన్నాయని తెలిపారు.