హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన కంపెనీలపై చైనా సైబర్ నేరస్తులు దాడులు చేస్తున్నట్లు అమెరికా ఆరోపించింది. అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ఉన్న టీకా పరిశోధనా కేంద్రాలపై చైనా సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు అమెరికా న్యాయశాఖ పేర్కొన్నది. ఈ కేసులో చైనాకు చెందిన లీ జియావూ(34), డాంగ్ జియాజి(33)పై నేరాభియోగం నమోదు అయ్యింది. ఈ ఇద్దరూ అమెరికా, చైనా, హాంగ్‌కాంగ్‌లో ఉన్న మానవ హక్కుల కార్యకర్తలను కూడా హ్యాక్ చేసినట్లు అసిస్టెంట్ అటార్నీ జనరల్ జాన్ డీమర్స్ తెలిపారు. అయితే కోవిడ్ రీసర్చ్ కేంద్రాలపై రష్యా సైబర్ అటాక్ చేస్తున్నట్లు గత వారమే బ్రిటన్, యూఎస్, కెనడా దేశాలు ఆరోపించాయి.
చైనాకు చెందిన ఇద్దరు హ్యాకర్లు ఎలక్ట్రికల్ ఇంజినీర్లు. వారి ఫోటోలను ఎఫ్‌బీఐ రిలీజ్ చేసింది. వాణిజ్య రహస్యాలను తస్కరించడం, ఆన్‌లైన్ ఫ్రాడ్ కేసుల్లో అభియోగం నమోదు అయ్యింది. ఈ ఇద్దరూ మసాచుసెట్స్ బయోటెక్ సంస్థపై జనవరిలో సైబర్ దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ల్యాబ్‌లో కోవిడ్19 వ్యాధి చికిత్స కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. మేరీల్యాండ్ కంపెనీపైన కూడా ఈ ఇద్దరూ సైబర్ దాడులు చేసినట్లు ఎఫ్‌బీఐ చెబుతున్నది. అయితే ఆ ఇద్దరూ ప్రైవేటు హ్యాకర్లు అని, వారికి చైనా ఇంటెలిజెన్స్ ఏజెంట్ల నుంచి సహాకారం ఉన్నట్లు తెలుస్తోంది.